ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ల యుద్ధం, ఇరాన్ ప్రతిదాడులు, గల్ఫ్‌లో భారతీయుల పరిస్థితి, దేశంలో ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చకు కేంద్రం నిరాకరించడం పట్ల పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం.. అమెరికా, ఇజ్రాయిల్‌కు లొంగిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. రెండోదశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా వివాదాలకు సంబంధించిన అంశాలపై చర్చకు అనుమతి ఇవ్వని కేంద్రప్రభుత్వ వైఖరిపై పార్లమెంటులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చర్చకు అనుమతి ఇవ్వకుండా విదేశాంగ మంత్రి ప్రకటనతో ఈ అంశాన్ని ముగించాలన్న ప్రభుత్వ వైఖరిపై ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ‘దేశం తీవ్రమైన ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల దిశగా పయనిస్తోంది. లక్షలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాలు, ఇరాన్లో చిక్కుకుపోయారు. ఈ అంశాలపై వివరణాత్మక చర్చ జరపకపోవడం పట్ల మోడీ ప్రభుత్వం వైఖరి ఆమోదయోగ్యం కాదు’ అని ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. 
![]()
