ఆంధ్రప్రదేశ్‌లో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి
నాయుడు తెలిపారు. అందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఆయన మంత్రులకు సూచించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిందని, రాబోయే ఎన్నికల్లో కూడా అదే విజయాన్ని కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే చేసిన పనులను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడంలో మరింత చురుకుగా ఉండాలని సూచించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పలు అంశాలపై సీఎం చర్చించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ కొరత తలెత్తే అవకాశం ఉన్నందున పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కొందరు గ్యాస్‌కు బదులుగా ఎలక్ట్రిక్ పొయ్యిలు ఉపయోగిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అయితే ఎలక్ట్రిక్ పొయ్యిల వినియోగం పెరిగితే విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశమున్నందున విద్యుత్ వినియోగాన్ని గమనించాలని సీఎం చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు ‘జలాధార’ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాలువలు, డ్రైన్లు శుభ్రపరచడం ద్వారా భూగర్భ జలాలను పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. అలాగే మే 15 నాటికి సాగునీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ నెల 16న అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరగనుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల ఆరుగురు మంత్రులు మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేకపోయినట్లు సమాచారం.
![]()
