ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు 10.91 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి జాతీయ సగటు 8.8 శాతంతో పోలిస్తే ఇది గణనీయంగా అధికం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రంగాల వారీగా ఆర్థిక ప్రగతి వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక రంగం తిరిగి గాడిలో పడిందని, అన్ని రంగాల్లోనూ సానుకూల వృద్ధి కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2025-26 రెండో త్రైమాసికం నాటికి వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో బలమైన వృద్ధి నమోదైనట్లు సీఎం వివరించారు. ఈ త్రైమాసికంలో వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.1,25,571 కోట్లుగా ఉండగా, పారిశ్రామిక రంగం జీవీఏ రూ.86,456 కోట్లు, సేవల రంగం జీవీఏ రూ.1,60,075 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం 2.78 శాతం నుంచి ఏకంగా 12.20 శాతానికి ఎగబాకి జాతీయ సగటును అధిగమించడం విశేషం.
![]()
