ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులపై ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉందని, ప్రభుత్వ టీచర్లే ఉత్తమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి మెరుగ్గా ఉందని, ప్రతి 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో 25 మందికి ఒకరే ఉన్నారని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలోని ఏపీ మోడల్ హైస్కూల్లో నిర్వహించిన “మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-3.0” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించింది, మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసింది. కానీ మా ప్రభుత్వం టీచర్లకు గౌరవం ఇస్తుంది. మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయులను నియమించాం. పారదర్శకంగా బదిలీలు చేపట్టాం. టీచర్లను గౌరవించే బాధ్యత మాది, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది,” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని అందరూ కోరుకునే పరిస్థితిని తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
![]()
