ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో దశ భూ సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడు గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించాలన్నా, ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్ వంటి భారీ మౌలిక సదుపాయాలు నిర్మించాలన్నా భూమి అత్యవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారమే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, కేబినెట్ సమావేశంలో రెండో దశ భూ సమీకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో భూసేకరణ చేపట్టబోయే గ్రామాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, పెదమద్దూరు, పెదపరిమి గ్రామాలను అధికారులు ప్రతిపాదించారు. ఆయా గ్రామాల్లో భూ లభ్యత, రికార్డులు, యాజమాన్య వివరాలపై అధికారులు సమర్పించిన నివేదికలను కేబినెట్ పరిశీలించింది.
![]()
