అమరావతి
: గనుల అక్రమ తవ్వకాలను ఆర్టిజిఎస్ వ్యవస్థతో గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లీజు పొందిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే గుర్తించేందుకు డ్రోన్, శాటిలైట్ చిత్రాలను వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో గనుల శాఖపై సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గనుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకోవాలన్నారు. అధిక ఆదాయాన్ని పొందుతున్న రాష్ట్రాల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉందని, ఆ రాష్ట్రంలో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారో గమనించి, వాటిని రాష్ట్రంలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. గనుల నుంచి వచ్చే వివిధ ఖనిజాలకు సంబంధించి ముడి సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతోపాటు, ఆ ఖనిజాలకు విలువ జోడించడంతో దేశీయంగా వాటిని వినియోగించుకుని, మరింత ఆదాయం వచ్చేలా చేయాలన్నారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో లభిస్తున్న లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రానైట్ సహా వివిధ ఖనిజాలు ఏఏ ఉత్పత్తులకు ముడి సరుకుగా ఉపయోగపడతాయనే అంశాన్ని విశ్లేషించాలని సూచించారు. ఆ మేరకు ఏఏ ఖనిజాలను నేరుగా వినియోగించవచ్చు, ఏఏ ఖనిజాలకు విలువ జోడించాలనే విషయాలను గుర్తించాలన్నారు. సిమెంట్, ఫ్యాక్టరీలు ఇప్పటికే లైమ్ స్టోన్ ఖనిజాన్ని తీసుకుంటున్నాయని, అదేవిధంగా ఐరన్ ఓర్ స్థానికంగా స్టీల్ పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయన్నారు.
![]()
