అమరావతి
: ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు సూచించారు. యూనిట్ వ్యవస్థ పార్టీకి బలంగా ఉందని తెలిపారు. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ముఖ్యనేతలు, బూత్‌స్థాయి కార్యకర్తలతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వ విధానమన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఎలాంటి ఆటంకమూ లేకుండా పింఛన్ల పంపిణీ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల అనర్హులకు పింఛన్లు అందుతున్నాయని అన్నారు. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని తెలిపారు.
పింఛన్ల కోసమే ఇప్పటి వరకు రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలోనే ఇది అతిపెద్ద డిబిటి కార్యక్రమం అని చెప్పారు. ప్రజలకు సంతృప్తి ఇస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో 17 నెలలుగా తాను స్వయంగా పాల్గొని అందిస్తున్నానని తెలిపారు. సోమవారం జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించటంతో పాటు ప్రజలతో నేతలు మమేకం కావాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి చెబితే కూటమిని కాదని పక్క పార్టీలకు ప్రజలు ఓటు వేయరని తెలిపారు. కార్యకర్తల మనోభీష్టం మేరకే నాయకత్వం ముందుకెళ్లాలని కోరారు. పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తున్నామని చెప్పారు. అందరితో సమన్వయం చేసుకుని పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలని తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ క్యాలెండర్ రూపొందించామన్నారు.
![]()
