రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి త్వరలోనే బ్లూప్రింట్ తయారు చేస్తామని ముఖ్యమంత్రి
నాయుడు చెప్పారు. సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులపై శాసనసభలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎకరాకూ నీరందించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడమే తమ లక్ష్యమని అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా నీటిభద్రత అత్యంత కీలకమని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి, మరుసటి ఏడాదిలో కృష్ణ పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి దక్యిందని అన్నారు. ప్రకృతిని నదులు, నీటి వనరులను ఆరాధించే సంస్కృతి ఉన్న నేపథ్యంలో గోదావరి నదికి అఖండ హారతిని, కృష్ణానదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరుగా భావించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రతిఏటా గోదావరిలో మూడువేల టిఎంసిలు వృథాగా పోతున్నాయని తెలిపారు. వంశధార నుండి పెన్నానది వరకూ నదులను అనుసంధానిస్తే నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానంపై చర్చలు జరిగాయని, అందుకే రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొన్నారు.
![]()
