పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభ సమావేశమైన వెంటనే, ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఈ సమావేశాల్లో 14 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వగా, పలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేశాయి. మరోవైపు, కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, జాతీయ భద్రత, పెరుగుతున్న కాలుష్యం, రైతులకు కనీస మద్దతు ధర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో, ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
కాగా, కొత్త ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ అధ్యక్షతన రాజ్యసభ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. డిసెంబర్ 19 వరకు జరగనున్న ఈ సమావేశాలు మొత్తం 15 రోజుల పాటు కొనసాగుతాయి.
![]()
