న్యూఢిల్లీ
: శీతాకాల సమావేశాలను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కుదించిన కేంద్ర ప్రభుత్వం, తొలిరోజే పార్లమెంటు కార్యకలాపాలను శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లకుండా మొండిగా వ్యవహరించింది. తీవ్ర విమర్శలకు గురైన ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అత్యవసర చర్చ జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం తొలిరోజే పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సహేతుకమైన డిమాండ్‌కు సానుకూలంగా స్పందించాల్సిన కేంద్రప్రభుత్వం, ఉభయ సభల్లోనూ ధిక్కార వైఖరిని అవలంబించింది. ఫలితంగా లోక్‌సభ పూర్తిగా స్తంభించిపోయింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
ఎస్ఐఆర్పై పార్లమెంటు దద్దరిల్లింది. ప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభలో వాయిదాల పర్వం నడిచింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవగానే, ఇటీవల మరణించిన సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. ఈ సమయంలో ఎస్ఐఆర్పై చర్చించాలని పట్టుపడుతూ ప్రతిపక్ష సభ్యులు సభా వేదిక వద్దకు దూసుకెళ్లారు. అందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో వేదిక వద్దనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ నినదించారు.
![]()
