న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాయుకాలుష్యంపై పార్లమెంటులో చర్చ జరగాలని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ శుక్రవారం డిమాండ్ చేశారు. వాయు కాలుష్య సమస్యకు కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళిక గానీ, జవాబుదారీతనం గానీ లేదని రాహుల్ మండిపడ్డారు. ‘నేను కలిసిన ప్రతి తల్లి నాకు ఒకే మాట చెబుతుంది. తన బిడ్డ విషపూరిత గాలిని పీల్చుకుంటూ పెరుగుతోంది అని. వారు ఈ విషయంపై అలసిపోయారు. భయపడ్డారు. ఇప్పుడు మాత్రం కోపంగా ఉన్నారు. మోడీజీ భారతదేశ పిల్లలు వాయుకాలుష్యంతో మన ముందు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిపై మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ప్రభుత్వం వద్ద వాయుకాలుష్యంపై ఎందుకు అత్యవసర ప్రణాళిక, జవాబుదారీతనం లేదు? భారతదేశానికి వాయు కాలుష్యంపై తక్షణమే వివరణాత్మక చర్చ అవసరం. ఆరోగ్య అత్యసర పరిస్థితిని పరిష్కరించడానికి కఠినమైన, అమలు చేయగల కార్యాచరణ ప్రణాళిక అవసరం. మన పిల్లలు స్వచ్ఛమైన గాలికి అర్హులు. దీనికి సాకులు వంక పెట్టడం కాదు’ అని రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
![]()
