రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు చివరి వరకు పోరాడినా, భారత బౌలర్ల ధాటికి తలవంచింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో పాటు, కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రియాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) లను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చగా, కెప్టెన్ మార్క్రమ్ (7) ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఈ దశలో మాథ్యూ బ్రీట్జ్కే (72), టోనీ డి జోర్జి (39) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దూకుడుగా ఆడుతున్న జోర్జిని కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (37) వేగంగా ఆడినా, ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 
![]()
