ఇరాన్ యుద్ధం ప్రభావంతో ఎల్పీజీ సహా వివిధ ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల విషయంలో ఉదాశీనత వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయని చెప్పారు. అందువల్ల వాటిని అమలు చేసి తీరడంతో పాటు, ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్లకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన పి-4, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలను ప్రస్తావించారు. పి-4 టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుందని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. వనరులు పరిమితంగానే ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. మహిళ సంఘాలు తయారుచేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్‌తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టాలని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా తెచ్చిన 10 సూత్రాలు అమలు చేస్తే సుపరిపాలన అందించేందుకు వీలవుతుందన్నారు. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని, ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశించారు. 
![]()
