ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన ఎంఒయు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 2025 సెప్టెంబరులోనే సమగ్ర విధానాన్ని ప్రకటించినట్లు చెప్పారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామన్నారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
![]()
