ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా ఎక్కడెక్కడ పంటలు దెబ్బతిన్నాయో వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 16 మండలాలకు చెందిన 89 గ్రామాల్లో పంటలు నష్టపోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 1,215 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి, మొక్కజొన్న, మినుము పంటలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. ఈ నష్టంతో సుమారు 2,043 మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే, అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లో అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం 267 హెక్టార్లలోని ఈ పంటలకు నష్టం కలగగా, 307 మంది రైతులు ప్రభావితమయ్యారు. ఈ పరిస్థితిపై స్పందించిన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయాలని, రైతులకు తక్షణ సహాయం అందించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే వాతావరణ మార్పులపై రైతులకు ముందస్తు సమాచారం అందిస్తూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
![]()
