‘నక్కపల్లి ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ రాబోతోంది. ఉక్కు రంగంలో నక్కపల్లి ఉక్కు శక్తిగా మారబోతోంది. ఇది ఒక చరిత్ర. ఈ ప్రాంత వాసులు చాలా అదృష్టవంతులు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమలకు ఎపి బెస్ట్ ప్లేస్ అని పేర్కొన్నారు. ‘కొత్త ఆలోచనలతో రండి… పరిశ్రమలు పెట్టండి’ అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చందనాడ రెవెన్యూ పరిధిలో ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి.కుమార స్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్‌ప్లాంట్ ప్రతినిధులతో కలిసి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ శంకుస్థాపన స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదని… స్టీల్ సిటీ నిర్మాణం కోసమని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ మన రాష్ట్రానికి రావడం చాలా మంచి పరిణామమని, అనకాపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంతోపాటు రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టడానికి ఈ స్టీల్‌ప్లాంట్ ఉపకరిస్తుందని అన్నారు. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఈ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును శంకుస్థాపన చేసుకున్నామని, ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని వివరించారు.
![]()
