రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోవడంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో సుమారు 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైందని, దీనివల్ల ఉత్పత్తి పెరిగి ధరలు పతనమయ్యాయని వివరించారు. క్వింటాల్‌కు రూ.2,400 కనీస మద్దతు ధర ఉండగా, మార్కెట్లో కేవలం రూ.1,500 నుంచి రూ.1,700 మాత్రమే లభిస్తోందని, దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
![]()
